Read more!

సీతమ్మకు త్రిజట చెప్పిన రహస్యం!

 

సీతమ్మకు త్రిజట చెప్పిన రహస్యం!

రామలక్ష్మణులు చనిపోయారని యుద్ధ భూమిలో రాక్షసులు అంతా ఉత్సాహంతో గెంతులు వేస్తూ, కేకలు వేస్తూ ఆనందంగా ఉన్నారు. వానరులందరూ చాలా నిరుత్సాహంతో, దీనంగా నిలుచుని ఉన్నారు. అప్పుడు ఆ రాక్షసులు సీతమ్మని పుష్పక విమానంలో తీసుకెళ్ళి యుద్ధ భూమిలో పడిపోయున్న రామలక్ష్మణులని చూపించారు. సీతమ్మ కిందకి చూడగా, ముళ్ళు విప్పిన ముళ్ళ పంది ఎలా ఉంటుందో, అలా బాణములతో కొట్టబడిన రామలక్ష్మణులు ఉన్నారు. రామలక్ష్మణులు ఇద్దరూ మరణించారు అనుకొని సీతమ్మ గుండెలు బాదుకొని ఏడ్చింది. అప్పుడు సీతమ్మ "నేను పుట్టింట్లో ఉన్నప్పుడు మహా జ్ఞానులైన జోతిష్యులు నా పాదాలు చూసి "అమ్మ! నీ పాదాలలో పద్మాలు ఉన్నాయి. ఏ స్త్రీ అరికాళ్ళలో పద్మాలు ఉంటాయో, ఆ పద్మములు కలిగిన స్త్రీ తన భర్తతో పాటు సింహాసనం మీద కూర్చుని మహారాణిగా పట్టాభిషేకం చేసుకుంటుంది" అన్నారు. 

కాని వారు చెప్పిన మాటలన్నీ అసత్యాలు అయ్యాయి. చిన్నతనంలో మా తండ్రిగారి పక్కన నేను కూర్చుని ఉంటే దైవజ్ఞులైన వారు మా ఇంటికి ఎక్కువగా వస్తుండేవారు, అప్పుడు వారు నా సాముద్రిక లక్షణాలు చూసి "తల మీద వెంట్రుకలు చాలా మెత్తగా, ఒత్తుగా, నల్లగా ఉన్నటువంటి స్త్రీ ఈమె, కనుబొమ్మలు కలవని స్త్రీ ఈమె, పిక్కలు గుండ్రంగా ఉండి వాటి మీద వెంట్రుకలు లేని స్త్రీ ఈమె, దంతముల మధ్యలో ఖాళీలు లేని స్త్రీ ఈమె కనుక ఈమె అయిదోతనాన్ని పూర్ణంగా పొందుతుంది, మహానుభావుడైన వాడిని భర్తగా పొందుతుంది" అని చెప్పారు. కాని అవన్నీ అబద్ధాలు అయిపోయాయి. నా వేళ్ళ మీద ఉండే గుర్తులు, నేత్రములు, చేతులు, పాదములు, తొడలు గుండ్రంగా, సమంగా ఉండేవి, నా గోళ్ళు ఎర్రటి కాంతితో ఉండేవి, అలా ఉండడం వలన నేను పూర్ణమైన అయిదోతనాన్ని పొందుతానని మా ఇంటికొచ్చిన జ్యోతిష్యులు చెప్పేవారు.

రామ! రావణుడు నన్ను అపహరించాక దండకారణ్యం అంతా వెతికావు, హనుమని పంపించావు, నాకోసం సముద్రానికి సేతువుని కట్టి, దాటి వచ్చావు. చివరికి యుద్ధంలో ఇంద్రజిత్ మాయ వలన మరణించావు. ఎంత ఆశ్చర్యం రామ, నీకు బ్రహ్మాస్త్రం తెలుసు, బ్రహ్మశిరోనామకాస్త్రం తెలుసు, వారుణాస్త్రం తెలుసు, ఆగ్నేయాస్త్రం తెలుసు, ఇన్ని అస్త్రములు తెలిసిన నిన్ను ఒకడు కేవలం మాయతో కనపడకుండా కొట్టిన బాణములకు శరీరం వదిలేశావు. నువ్వు మరణించావన్న వార్త విని కౌసల్యాదులు బతుకుతారా, అయోధ్య అయోధ్యలా ఉంటుందా. నువ్వు ఇన్ని కష్టాలు పడడానికి, అర్ధాంతరంగా శరీరం విడిచేయుటకు నన్ను పెళ్ళి చేసుకున్నావా, నువ్వు నన్ను చేసుకోకపోతేనే బాగుండేదేమో" అని సీతమ్మ ఏడుస్తుంటే పుష్పకంలో ఉన్న త్రిజట చూడలేకపోయింది. 

అప్పుడు త్రిజట "ఏడవకు సీతమ్మ, రామలక్ష్మణులు మరణించలేదు, వాళ్ళిద్దరూ సజీవంగా ఉన్నారు. నేను నిన్ను ఓదార్చడానికి ఈ మాటలు చెబుతున్నానని అనుకుంటున్నావు, కాని నేను నీకు రామలక్ష్మణులు బతికున్నారని చెప్పడానికి ఒక బలవత్తరమైన కారణాన్ని చెబుతాను విను. భర్త మరణించిన స్త్రీ కాని ఈ పుష్పక విమానం ఎక్కితే ఇది పైకి ఎగరదు, నువ్వు పుష్పకంలోకి ఎక్కగా ఇది ఆకాశంలో నిలబడిందంటే, నువ్వు సౌభాగ్యవతిగా ఉన్నావు అని అర్ధం. యోధుడైనవాడు నిజంగా శరీరాన్ని విడిచిపెడితే సైన్యాలు ఇలా నిలబడవు, ఎవరి మానాన వారు పారిపోతుంటారు. రామలక్ష్మణుల ముఖాల్లో కాంతి ఏ మాత్రం తగ్గలేదు. కొద్దిసేపు మూర్చపోయారు అంతే. 

కొద్దికాలంలో రావణుడి పది తలలు పడిపోయి ఇదే పుష్పకంలో రాముడితో కలిసి నువ్వు అయోధ్యకి వెళ్ళిపోతావు. ఏ రాక్షస స్త్రీకి నామీద లేని ప్రేమ నీ ఒక్కదానికే నా మీద ఎందుకు అంటావేమో, నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చినప్పటినుండి నీ ప్రవర్తన చూస్తున్నాను. నీ ప్రవర్తన చేత, నీకు భర్త అంటే ఉన్న ప్రేమ చేత. నాకు నువ్వంటే విపరీతమైన ప్రేమ ఏర్పడింది. అందుకని నీకెప్పుడూ మంచి చెయ్యాలనే చూస్తుంటాను. అమ్మ! ఇంతకముందెన్నడూ నేను అబద్ధాలు చెప్పలేదు, ఇక ముందు కూడా ఎన్నడూ అబద్ధాలు చెప్పను. రామలక్ష్మణులు జీవించి ఉన్నారని నేను చెప్పినది పరమ సత్యం, నువ్వు బెంగ పెట్టుకోకు తల్లీ" అని చెప్పి సీతమ్మను త్రిజట ఓదార్చింది.

                                         ◆నిశ్శబ్ద.